Tuesday, September 21, 2021

ఉండ్రాళ్ళతద్దె - మహాలయ పక్షం

నేటి విశేషం ---------- ఉండ్రాళ్ళతద్దె / ఉండ్రాళ్ళ తదియ మన సాంప్రదాయం లో ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యత, ఆరోగ్యపరమైన రహస్యాలను మేళవించి రూపొందించారు మన శాస్త్రాలు ... అటువంటి లక్షణాలన్నీ ఉండి మహిళలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ‘ఉండ్రాళ్ల తద్దె’. ప్రతి గ్రామంలో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, హుషారుగా జరుపుకునే ఈ వేడుక ప్రతి సంవత్సరం భాద్రపద బహుల తదియ నాడు అంటే పౌర్ణమి తర్వాతి తదియ తిథి రోజున వస్తుంది. ఈ పండుగ జరుపుకునే విధానాన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మిక భావంతో పాటుగా ఊరిలోని వారందరి మధ్య ఒక ఐక్యతాభావం, అలాగే ఈ పండుగకు తీసుకోవాల్సిన ఆహారం విషయం చూస్తే వర్షరుతువులో వచ్చే భాద్రపద మాసానికి తగిన విధంగా ఆరోగ్యపరిరక్షణ మొదలైనవి మనకు కనిపిస్తాయి. తరతరాలుగా ప్రతి గ్రామంలోను తెలుగింటి ఆడపడుచులు ఈ ఉండ్రాళ్ల తద్దె పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవటం మనం చూస్తుంటాం. ఉండ్రాళ్ల తద్దెకు కేవలం తదియ రోజు మాత్రమే కాకుండా ఆ ముందు రోజైన విదియకు కూడా ఎంతో పాత్ర ఉంది. పూర్వకాలంలో ముందు రోజు ఐదుగురు ముత్త యిదువులకు మహిళలు గోరింటాకు ముద్దను, పసుపు, కుంకుమ, కుంకుడుకాయలు, నువ్వులనూనె ఇచ్చి వారిని తమ ఇంటికి తాంబూలం తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించేవారు. అదేవిధంగా వివాహం కాని యువతులు కూడా ఈ ఉండ్రాళ్ల తద్దె నోము నోచుకుంటే త్వరగా వివాహం అయి మంచి భర్త లభిస్తాడని, వివాహితలు నోము నోచుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. దీంతో వివాహం కాని యువతులు సైతం ముందురోజు తెల్లవారుజామున కుంకుడుకాయలతో తలస్నానం చేసి, జుట్టుకు సాంబ్రాణి పొగ వేయటం కనిపిస్తుంది. కుంకుడుకాయలు జుట్టులోకి చుండ్రును చేరనీయకుండా చేస్తాయి, ఇక సాంబ్రాణి వల్ల వెంట్రుకల మూలాల దగ్గర ఉన్న తడిసైతం ఆవిరవుతుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఉదయం 6 గంటలలోపే గోంగూరపచ్చడితో పెరుగన్నం పిల్లలందరికి వారి తల్లి తినిపిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర శరీరంలో ఉష్ణోగ్రత కలిగిస్తే, పెరుగన్నం చలువ పదార్థం కనుక ఈ కాలంలో ఎటువంటి వ్యాధులకు శరీరం గురికాకుండా ఉష్టోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో నువ్వులపొడిని కూడా కలుపుని తింటారు. దీంతో ఈ వర్షాకాలంలో సహజంగా వచ్చే జలుబు, రొంప, కళ్ల మంటలు వంటి అనేక వ్యాధులకు దగ్గరికి కూడా రావు. ఇక రెండో రోజైన తదియ నాడు అసలైన సందడి మనకు కనిపిస్తుంది. ఆ రోజు తెల్లవారుజామునే గోంగూర, ఆవకాయ నంచుకుని పెరుగన్నం తినడం గ్రామాల్లోని ప్రతి ఇంటిలో జరుగుతుంది. ఆ తర్వాత ఊరిలోని మహిళలు, ఆడపిల్లలు ఒకచోట చేరి ఉయ్యాలలూగటం, దాగుడుమూతలు, దూదుంపుల్ల, కోతికొమ్మచ్చి వంటి అనేక ఆటలు ఆడతారు. ఈ ఆటలు పూర్తయ్యేసరికి మహిళలు తాము చేసిన ఉండ్రాళ్లను తోటి మహిళలకు పంచుతారు. ఈ విధంగా ఈ పండుగల సామాజిక సమైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం ఎవరింటిలో వారు గౌరీదేవిని పూజించి, ఐదు దారపు పోగులు, ఐదుముడులతో ఏడు తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తారు. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోమునోచుకునే మహిళకు, మిగతా ఐదు ముత్తయిదువులకు కడతారు. అదేవిధంగా బియ్యంపిండిలో బెల్లం కలిపి చేసిన పచ్చి చలిమిడిని, ఐదు ఉండ్రాళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఉండ్రాళ్ల తద్దె వ్రత కథను చెప్పుకోవాలి. ఆ కథ చెప్పుకునేముందు అక్షింతతలను చేతిలో ఉంచుకుని కథ పూర్తయిన తర్వాత వాటిలో కొన్నింటిని అమ్మవారి పాదాల దగ్గర వేసి మిగతావి నోము నోచుకునే మహిళ తన తలపై వేసుకోవాలి. ఆ తర్వాత తాము పిలిచిన ఐదుగురు ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. పూర్ణంబూరెలు, గారెలు, తోరము ఇలా అన్నింటిని ఒక పళ్లెంలో ఉంచి ‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటి వాయనం’ అని చెప్తూ మహిళలు ఈ వాయనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భాద్రపదమాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది, వినాయకునికి మోదకప్రియుడు అనిపేరు. అలాగే ఈ ఉండ్రాళ్ల తదియకు కూడా ‘మోదక తదియ’ అనే పేరు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా మహిళల వస్త్రధారణ, శారీరక వ్యాయామం కలిగేలా ఆటలు, ఆరోగ్యపరమైన ఆహారం, గౌరీదేవిని పూజించటం ద్వారా ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటి సమ్మేళనంతో మహిళలకు సకల సౌభాగ్యాలను కలుగుజేసే గొప్ప తెలుగు పండుగ ఉండ్రాళ్ల తద్దె అనటంలో ఎటువంటి సందేహం లేదు... 🥀శుభమస్తు🥀🙏 సమస్త లోకా: సుఖినోభవంతు.🙏


మహాలయ పక్షం సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమై అక్టోబర్ 6 తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించి , వారికి నమస్కారము చేస్తూ , *నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి , మీ దీవెనలు అందచేయండి’* అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో , ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.
తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (అక్టోబర్ 6 న) నైనా చేసి తీరాలి.
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.
ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి , తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా *‘‘కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’* అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.
కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా , ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.
ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది , ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

పితృ పక్షం.. అంటే 15 రోజుల పాటు పూర్వీకులను ఆరాధించే పండుగ ఇది. ఇది సెప్టెంబరు 21 మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ 15 రోజుల పాటు పూర్వీకులకు పిండ ప్రధానం చేస్తారు. హిందుమతాన్ని అనుసరించే ప్రతి ఇంట్లోనూ పితృదేవతలకు శ్రద్ధా కర్మలను చేయడం, పిండాలను అర్పించడం తప్పనిసరి అని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఈ విధంగా చేయనట్లయితే కొన్ని అనుకోని ఆందోళనలు, అశుభ సంకేతాలతో ప్రజలు కలవరపడతారు. అంటే వారి పితృ దోషాలు అంటుకుంటాయని అర్థం చేసుకోవాలి. ఈ దోషాలు అంటుకున్నప్పుడు ఇంట్లో కొన్ని అపశకునాలు, లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం . సాధారణంగా బోజనం చేసేటప్పుడు ఆహారంలో వెంట్రుకల కనిపిస్తూ ఉంటాయి. కానీ విరివిగా కనిపిస్తున్నాయంటే ఆ అంశాన్ని అంత సులభంగా విస్మరించవద్దు. కుటుంబ సభ్యుల్లో బోజనం చేసేటప్పుడు చాలాసార్లు జుట్టు వస్తుంటుంది. అది ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికి అంతుపట్టదు. ఇంట్లోనే కాదు వారు బయటకు వెళ్లి రెస్టారెంట్లు, హోటెళ్లో తినాల్సివచ్చినా ఆహారంలో వెంట్రకుల వస్తాయి. కొన్ని సార్లు ఎదుటివారు ఎగతాళి చేస్తారు. ఈ విధంగా తరచూ జరుగుతూ ఉంటే మీ జాతకాన్ని ఓ సారి జ్యోతిష్కుడికి చూపించుకుంటే మంచిది. ​ఇంట్లో దుర్వాసన.. ఇల్లు ఎంత శుభ్రంగా, అందంగా ఉన్నప్పటికీ దుర్వాసన వస్తుందంటే ఆ విషయాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. అసలు చెడువాసన ఎక్కడ నుంచి వస్తుందో అర్థం కాదు. అసలు అక్కడ ఏమి లేకపోయినప్పటికీ చెడు వాసన వస్తుందని బయట నుంచి వచ్చిన వాళ్లు అంటుంటారు. ఈ విధంగా దుర్వాసన వస్తుందంటే పూర్వీకులకు కోపం వచ్చిందని అర్థం చేసుకోవాలి. పితృ దోషాలు వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని అస్సుల మర్చిపోకూడదు. ​పూర్వీకులు కలలోకి వస్తారు.. చనిపోయిన బంధువులు, పూర్వీకులు తరచూ కలలోకి వస్తున్నారని కొంతమంది చెబుతుంటారు. ఈ అంశాన్ని యాదృచ్ఛికమని మచెప్పలేం. పూర్వీకుల గురించి పదేపదే కలలు కనడమంటే వారి కోరికలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయని కొంతమంది నమ్ముతుంటారు. ఒకవేళ మీకు కూడా ఈ విధంగా జరుగుతున్నట్లయితే చనిపోయిన మీ పూర్వీకులు, బంధువులకు ఇష్టమైన వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే మంచిది. ​ శుభకార్యాల్లో అవంతరాలు .. మీరు కొన్ని శుభకార్యాలు చేయాలని తలపెట్టినప్పుడు వాటికి పదే పదే అవంతరాలు ఎదురవుతున్నాయంటే కొద్దిగా దృష్టిపెట్టాలి. లేదా మీరు పని మధ్యలో ఉన్నప్పడు ఏవైనా సంఘటనలు జరిగితే పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. దీపావళి, హోళీ లాంటి పండుగులప్పుడు కొన్ని అపశకునాలు లేదా దుర్ఘటనలు జరిగుతున్నాయంటే అవి పితృ పక్షం వారి అసంతృప్తిని తెలియజేస్తుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా జరిగితే బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి గౌరవంగా ఆరాధించి భిక్ష ఇవ్వాలి. ​ వివాహం ఆలస్యమైతే.. ఈ రోజుల్లో వివాహం ఆలస్యంగా చేసుకోవడమనేది తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఏమి కాకుండానే పెళ్లిళ్లు ఆలస్యమవుతాయి. ఇలా సంబంధం విచ్ఛిన్నమయ్యే ప్రతిసారి పూర్వీకుల అసంతృప్తిని తెలియజేస్తుంది. కొన్నిసార్లు పూర్వీకుల కోపం వల్ల విడాకులు తీసుకోవాల్సిన స్థితి రావచ్చు . ఇంకా పరిస్థితుల ఎంత దూరమైన వెళ్లవచ్చు. కాబట్టి ఇంట్లో పూర్వీకులను ఆరాధించడం తప్పనిసరి. ​ సంతానం లేకపోవడం .. కొన్ని కారణాల వల్ల పూర్వీకులు మీపై కోపంగా ఉండే అవకాశముంది. మీరు వారితో మంచిగా ప్రవర్తించకపోయినా, వారి గురించి పట్టించుకోకపోయినా.. పితృ దోషం జరుగుతుంది . ఫలితంగా సంతానం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పూర్వీకులకు సేవ చేయడం ఎంతో ముఖ్యం . వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో 15 రోజుల్లో ఏదోక సమయంలో వారికి పిండప్రధానం చేసి వారిని సంతృప్తి పరచడాలి. వీలైతే వారి పేరు మీద విరాళాలు ఇస్తే మంచిది 🙏


YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...