Tuesday, June 2, 2026

సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం, నవంబర్ 21,1968) Sadhana Camp.

 

Sadhana Camp.

 ఓం శ్రీ సాయిరామ్

సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం)

(స్వామి వారి దివ్యోపన్యాసం, నవంబర్ 21,1968)

ఆయా జిల్లాల  ప్రతినిధులతో చర్చల ఫలితంగా ,  మీ జిల్లా అధ్యక్షులు నాకు సమర్పించిన నివేదికలను, ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అందులో మీ ఆశలు, ఆశయాలతో కూడిన అంశాలు గమనించాను. ఆ ఆలోచనలన్నీ మీకు సంతోషాన్నిచ్చేవి. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, మీరంతా ప్రస్తుతం చేస్తున్న, భవిష్యత్తులో చెప్పట్టబోయే ఈ కార్యక్రమాలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనసుని శుద్ధి చేయడం మాత్రమే.

మీ కందరికి తెలిసిన విషయమే, ధోబికి పలు రకాల బట్టలు ఇచ్చినప్పుడు వాటిలో  పాంట్లు,బుష్కోట్లు,తువ్వాలు,ధోతి వంటివి వున్నా,అతనికి ఇవ్వడంలో వున్న ప్రయోజనం, అతను చేసే పని ఒకటే కేవలం శుభ్రపరచడం. అలాగే మీరు ధ్యానం చేయమని ఉత్సాహపరిచినా, ప్రవచనం ఏర్పాటు చేసినా, భజనలు నిర్వహించినా, పేదవారికి బట్టలు పంచినా, పూజలు చేయించినా లక్ష్యం ఒక్కటే, అది అహంకారం,దురాశ,ద్వేషం,అసూయ,అత్యాశలతో కలుషితమైన  మనసుని శుద్ధి పరచడం. ప్రతిఒక్కరు అలవర్చుకోవల్సిన ఒకే ఒక గుణం పరస్పరం ప్రేమను పంచడం. అన్ని రూపాల దైవభక్తులలో, సాయి భక్తుని గుర్తింపు అది మాత్రమే. మనుషులు పుడుతుంటారు, మరణిస్తారు. నడుమ కాలంలో పెరుగుతారు, క్షీణిస్తారు. ఈ పరస్పర ప్రేమ పెరుగుదల గుర్తింపు సేవ ద్వారా మాత్రమే ప్రకటించబడుతుంది. ధనవంతులకి, ఉన్నత పదవులలో వున్నవారికి సేవలు చేసేవారు చాలా మందే వుంటారు. కానీ మీరు సేవలు చేయవల్సింది, ఏ సేవలు పొందలేని నిరుపేదలకి, అభాగ్యులకి మాత్రమే. ఇతరులకి సేవలందించడం ద్వారా జీవితాన్ని గడుపుతున్న వారికి సేవలు చేయండి. వేల సంఖ్యలో సంస్థలు ఇటువంటి సేవలు చేస్తున్నప్పుడు, నా పేరు పైన ఒక సంస్థ వుండవలసిన ప్రత్యేక అవసరం ఏమిటి. అందరిలో నేనున్నానని గుర్తించాలి, పూజా భావనతో అందరినీ సేవించాలి.

 

ప్రతీ చర్యలోనూ శరణాగతి తత్వం ప్రస్ఫుటమవ్వాలి.

సముద్రపు అలలపై ఒక ఎండుటాకుమీద ఒక చీమ ఒడ్డుకి చేరుకోవాలని తంటాలు పడుతోంది. దాని అవస్థ గమనించిన ఒక పావురం ఎగిరివెళ్ళి , చీమ వున్న ఆకుని తన ముక్కుతో పట్టి తెచ్చి నేల మీద పొడి ప్రదేశంలో వుంచింది. అనంతంగా నిండి వున్న దివ్యత్వం లో అణుమాత్రమైన  ఆ చీమ కూడా దైవ రూపమే. అడవిలో సముద్రంలో వున్న వికృతమైన జీవాలు కూడా పరమాత్మ దృష్టిలో అంతే ముఖ్యమైనవి . రక్షించడం కోసం నిన్ను ప్రేరేపించిన ప్రేమని, బాధని తొలగించడానికి నీలో పొంగిన దయని మాత్రమే భగవంతుడు చూస్తాడు. సేవని ఒక అధ్యాత్మిక సాధనగా సత్యసాయి సంస్థలు చేపట్టాలి. సభ్యులు నన్ను సర్వాంతర్యామిగా గుర్తించి సేవ ని పూజగా చేయాలి.

జిల్లా అధ్యక్షుడు, సమితి నిర్వాహకుడు సాధన తప్పనిసరిగా చేయాలి. భగవంతుని పై పూర్తి విశ్వాసం వుండాలి. వారి మాటలలో,ఆలోచనలలో మరియు చేతలలో ఆ విశ్వాసం కనిపించాలి. 

ప్రతీ చర్యలోనూ శరణాగతి తత్వం ప్రస్ఫుటమవ్వాలి.సభ్యులను ఉత్సాహ పరిచే కార్యక్రమాలను అధ్యక్షులు చేపట్టాలి. సంస్థ అభివృద్ధి చెందాలంటే వారికి ఈ నామ రూపాలపై విశ్వాసం వుండితీరాలి.

ఒకసారి హనుమంతుని ద్వారకకి తీసుకుని రమ్మని గరుడుని పంపించాడు కృష్ణుడు. రాముని ఆజ్ఞ తప్ప ఆన్యులని లెక్క చేయని ఆంజనేయుడు గరుడుని తో రానని గొడవ పడతాడు. ఈ సారి కృష్ణుడు కాదు రాముడుని కలవడం కోసం రమ్మని గరుడుని మళ్ళీ పంపిస్తాడు కృష్ణుడు.

ఇతరులపై అధికారం చెలాయించాలని కోరుకోరాదు. వారికి ఉపయోగపడే అవకాశాలు అన్వేషించాలి. తను చేసే పనిలో నిర్లక్ష్యం వలన అధికారం లో వున్న వారి వల్ల తలనొప్పులు ఎదురవుతాయి. ఒక సేవకుడిలా వుండాలి, అది కూడా భగవంతుని సేవకునిలాగా వుండాలి. అప్పుడే  తగిన శక్తి, ఆనందం కూడా మీకు తోడవుతాయి. ఆయన చేతులలో ఒక ఉపకరణంగా భావించాలి , మీ మంచేదో ఆయనకే తెలుసు, ఆయనకి కావల్సిన రీతిలో మిమ్మల్ని మలచనివ్వండి .

 

 

కలవరం నుండి మానవుని రక్షించగలిగేది ఉపేక్ష మాత్రమే

ఆయా సమితులు పని చేయడం ప్రారంభించిన తరువాత ప్రారంభంలో వున్న స్నేహ పూర్వక పరిస్థితి ప్రస్తుతం లేకపోవడం నేను గమనించాను. అభిప్రాయబేధాలు అధికమయ్యాయి, నిగ్రహం భయపడేలా అయింది. అపార్ధాలు , వర్గ వివక్షలు తలెత్తుతున్నాయి . కలిసివుండే మనుషులు విడిపోతున్నారు . తత్ , త్వం (అది,ఇది ) రెండూ ఒకటే, అది మర్చిపోవడం వల్ల దానికి దూరమవుతున్నారు . విషయ వాసనలకి దగ్గరైనప్పుడు ఆత్మ దూరమవుతుంది.  ఆత్మకి చేరువైనప్పుడు వాసనలు దూరమవుతాయి. మీరు భౌతిక విషయాలవైపు,ప్రపంచం వైపు దగ్గరవుతునప్పుడు అపేక్ష పెంచుకున్నట్టే, తద్వారా ఇష్టాయిష్టాల సంకెల లో బందీలవుతారు.

కీర్తి కోసం , సుఖాల కోసం అర్రులు చాచకుండా విముక్తులవండి. అంటే ఉపేక్ష పెంచుకోండి, స్వతంత్రులు కండి. ఉపేక్ష మాత్రమే కలవరం తొలగించి,పరమ సత్యాన్ని తెలియచేస్తుంది . మనిషి తనని తాను జంతువుగాను, భేతాలుడి  వలెనో మార్చుకొనరాదు . అతను దైవంగా మారాలి. దూరదృష్టితో ఒక శిలని శిల్పంగా మలచి వేణువు తో వున్నబహు సుందరమైన కృష్ణ రూపం మలచినట్టుగా, మనిషి కూడా విధి విసిరే తాకిడులని  శిల్పకారుడి ఉలి పోటుగా మార్చుకోవాలి.

మీరు ప్రతిపాదించిన అంశాల ఆధారంగా నా అంగీకారం కోసం పంపిన నివేదికలను పరిశీలించాను. నిధుల సమీకరణ కోసం మీరు చేసిన సూచనలు పూర్తి చెడుగా వున్నాయి. ఈ విషయంలో మీరంతా ఏక కంఠంతో చేసిన ప్రతిపాదన నాకు ఏ మాత్రం తృప్తిగా లేదు. ప్రాధమికంగా ధనం అంటే రజో గుణ సంబంధమై ప్రమాదాలు, హాని తలపెట్టే లక్షణం కలిగినది.

భవిష్యత్తు కోసము తేనెటీగలు తేనే సేకరించినట్టు , మానవుడు ధనమును కూడబెట్టుచున్నాడు. కానీ పొగ పెట్టి తేనెటీగలను తరిమి కొట్టి తేనే దొంగిలించబడుతోంది.  ధనం వసూలు చేసి నిల్వ చేయాలన్న మీ ఆలోచన నాకు అంగీకారం కాదు . నిధుల కోసం,దానాల కోసం మీరంతా తిరుగుతాననడం నాకు నచ్చలేదు .

 

 

ఖరీదైన వస్తువులు నిరుపయోగమైన ఆటంకాలు

మీరు గనుక సత్సంకల్పాలతో నిజాయితీగా ప్రార్ధన చేస్తే నిధులు వాటంతటవే వస్తాయని నేను అభయమిస్తున్నాను.  విశ్వాసంతో చూస్తూ వుండండి. నిధులు అవే ప్రవహిస్తాయి. పూర్వకాలంలో నిధుల ప్రస్తావన లేకుండా కేవలం విశ్వాసంతో, నిజాయితీ లతో మహర్షులు ఎన్నెన్నో పెద్ద పెద్ద యజ్ఞాలు నిర్వహించారు. ఇప్పుడు మీరంతా గర్వంతో, ఆందోళనతో, నమ్మకం లేకుండా తిరుగుతున్నారు . ఒక పెట్టికి చిన్న కన్నం పెట్టి, దాని ద్వారా సభ్యులు రహస్యంగా వేయాలి అని నేను  చేసిన సూచనని  మీరెవరు పాటించడం లేదని తెలుస్తోంది.

అదియే కాదు, మన సంస్థ కార్యక్రమాలకి అవసరమైన చాలా వస్తువులకి ఎక్కువ డబ్బు ఖర్చు అవసరం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. భజన, నగర సంకీర్తనలకి హృదయంలో తీవ్రమైన కాంక్ష మరియు  నాలుక పై నామం వుంటే చాలు. బృందావనం లో గోపికలు ఉదయం పూట వెన్న కోసం చల్ల కుండలు చిలుకుతూ హరినామ కీర్తన చేసేవారు . ఆ సమయంలోనే  వారి చేతులకున్న గాజుల గలగలలు, కుండలోపల కవ్వం తిరుగుతున్నప్పుడు చేసే చప్పుడులు నామ సంకీర్తనకి నేపధ్యసంగీతంలా మారి చల్లని చిరుగాలిలో చేరి ఇరుగుపొరుగు వారికి వీనులవిందు చేసేది. మందిని ప్రోగుచేసి, ఖరీదైన వస్తువులు కొనవలసిన అవసరం లేదు. నిజానికవి మీ సాధనకి ఏ మాత్రం ఉపయోగం లేకపోగా, ఆటంకాలు కలిగిస్తాయి.

ఉపన్యాసాల కోసం, వక్తల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టకండి. పురస్కారాలు, ఆర్భాటంగా చేసే స్వాగతాల వంటివి ఆమడ దూరం పెట్టండి. ఒక కుర్చీ, ఒక బల్ల చాలు.. చాలావరకు మీ సమావేశాలకోసం లౌడ్ స్పీకర్ల వంటివి కూడా విలాసవంతమే. అటువంటివన్నీ కూడా అవసరాల కన్నా గొప్పలు చూపించడానికి అన్నట్టుగా వుంటాయి. మీ చుట్టూరా వున్న ఇతర సంస్థల వారికి, నిధుల వినియోగంలో తీసుకునే జాగ్రత్తలు, వృధా ఖర్చులని తొలగించే విషయాలలో మీరొక ఉదాహరణగా నిలవాలి . మీ శక్తి మేరకే జనులను ఆహ్వానిచండి. తప్పనిసరి అనుకుంటూ సంఖ్య పెంచుతూపోకండి. ఎంతో మందిలో మనము అన్న భావన తో కాక వారే ఎదురు చూసే రీతిగా చేసుకోండి.

సమితి పనులలో ధనానికి అతి తక్కువ ప్రాముఖ్యత నివ్వండి  

హంగులు ఆర్భాటాలు లేకుండా పదిహేను లేక ఇరవై మందో కలిసి ఒక సమితి లేక సంఘంగా ఏర్పడి కార్యక్రమాలకి అవసరమైన ధనము సమకూర్చుకోవచ్చు. ధనవంతుడైన వ్యక్తి వలన ధనము పొందవచ్చుననే ఆలోచనతో అతనిని సభ్యునిగా చేర్చుకోరాదు. అణాల కన్నా గుణాలు మిన్న. నేను ఏదైనా పల్లెకి వెళ్లినప్పుడు తప్ప , అక్కడ ఏ ప్రత్యేక వేడుకలు నిర్వహించనవసరం లేదు.

పెద్ద పెద్ద సభల నిర్వహణ కోసం రకరకాల మార్గాల ద్వారా భారీగా నిధులు ప్రోగుచేసి, వాటిని దుర్వినియోగపరిచే వారిని నీవు విమర్శించవచ్చు. కనుక అటువంటి తప్పులు నీవు చేయకుండా నివారించాలి. నీ ఆత్మగౌరవాన్ని నీవు మరింత ఉన్నంతంగా పెంపొందించుకోవాలి..అది నీ ప్రత్యేకత కావాలి. నీకొక  మాస్టర్(స్వామివారే) వున్నాడు, ఆయన ఎవరిని యాచించడు, ఎవరి దగ్గర ఏమి తీసుకోడు. తనని అడిగే వారికి మాత్రం పుష్కలంగా అడిగినవన్నీ ఇస్తాడు. ప్రేమ అనే కానుకతో వింత ప్రదేశాలలో, వింత మనుషుల కోసం నేను తిరుగుతుంటాను . ఉపేక్ష నా బలం. మనిషికి మనిషికి నడుమ ఏ వ్యత్యాసం నేను చూపించను. అందువలన అందరూ నన్ను సమానంగా ప్రేమిస్తారు. అన్ని రకాల అపార్ధాలకి, విభజనలకి మూలం డబ్బు మాత్రమే. దానిని మరుగునే వుంచండి, అతి తక్కువ ప్రాముఖ్యత నివ్వండి. ప్రేమ, వినయం,నిర్లిప్తత మరియు సేవ మాత్రమే మీ నిధులు గా భావించండి.

కంటికి కాలికి ఏదో కనిపించని ప్రేమ బంధం వుంది. దారిలో నడుస్తున్నప్పుడు కన్ను ముల్లుని చూసినప్పుడు, కాలు పక్కకి జరుగుతుంది. అందువలన దేహసంక్షేమం రక్షింపబడుతుంది. అదే విధంగా జిల్లా అధ్యక్షుడు, సమితి అధ్యక్షుడు రెండు కళ్ల వలె మెలిగి దారిలో ముళ్లని గమనించి పాదాలని రక్షించుకోవాలి.

నా ఉద్దేశ్యంలో ప్రపంచ సమావేశాలు మూడు సంవత్సరాలకి ఒకసారి జరిగితే చాలు. అఖిల భారత సమావేశం సంస్థ యొక్క హృదయం ప్రశాంతి నిలయంలో జరగడమే చాలా మంచిది.

సంస్థ యొక్క హృదయం (ప్రశాంతి నిలయం)

(స్వామి వారి దివ్యోపన్యాసం – నవంబర్ 21, 1968)

1. కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం – మనస్సు శుద్ధి

  • జిల్లా అధ్యక్షులు సమర్పించిన నివేదికలు, ప్రతిపాదనలలో భక్తుల ఆశలు, ఆశయాలు గమనించబడ్డాయి.
  • సంస్థలో ప్రస్తుతం జరుగుతున్న మరియు భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని కార్యక్రమాల ప్రధాన లక్ష్యం మనస్సును శుద్ధి చేయడం.
  • ధ్యానం, ప్రవచనాలు, భజనలు, పూజలు, సేవా కార్యక్రమాలు అన్నీ అహంకారం, దురాశ, ద్వేషం, అసూయ, అత్యాశ వంటి దోషాలను తొలగించేందుకు.
  • ప్రతి సభ్యుడు పరస్పరం ప్రేమను పంచుకోవడం అనే గుణాన్ని అలవర్చుకోవాలి.
  • సాయి భక్తుని అసలు గుర్తింపు ప్రేమ మరియు సేవ మాత్రమే.

2. సేవ భావన – నిరుపేదల పట్ల కరుణ

  • సేవలు ధనవంతులకు లేదా ఉన్నత పదవుల్లో ఉన్నవారికి మాత్రమే కాకుండా సేవలు పొందలేని నిరుపేదలకు, అభాగ్యులకు చేయాలి.
  • ఇతరులకు సేవ చేయడం ద్వారా జీవించే వారిని ఆదుకోవాలి.
  • అందరిలో భగవంతుడు ఉన్నాడనే భావనతో సేవ చేయాలి.
  • సేవను పూజా భావంతో చేయడం సత్యసాయి సంస్థల ప్రధాన లక్ష్యం.

3. శరణాగతి తత్వం ప్రతి చర్యలో ఉండాలి

  • చీమను కాపాడిన పావురం ఉదాహరణ ద్వారా ప్రేమ, దయ, కరుణ యొక్క ప్రాముఖ్యత వివరించారు.
  • చిన్న జీవి అయిన చీమ కూడా దైవ స్వరూపమే అని గుర్తుచేశారు.
  • భగవంతుడు మన పనికన్నా దానిలోని ప్రేమ, దయ, కరుణను చూస్తాడు.
  • సేవను ఒక ఆధ్యాత్మిక సాధనగా చేపట్టాలి.
  • సభ్యులు సేవను భగవంతునికి చేసే పూజగా భావించాలి.

4. నాయకత్వంలో విశ్వాసం మరియు సాధన

  • జిల్లా అధ్యక్షులు, సమితి నిర్వాహకులు నిరంతర సాధన చేయాలి.
  • భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి.
  • మాట, ఆలోచన, చర్యలలో ఆ విశ్వాసం ప్రతిబింబించాలి.
  • సభ్యులను ఉత్సాహపరిచే కార్యక్రమాలు నిర్వహించాలి.
  • సంస్థ అభివృద్ధికి దైవ నామరూపాలపై విశ్వాసం తప్పనిసరి.

5. అధికారం కాదు – సేవ భావన అవసరం

  • ఇతరులపై అధికారం చెలాయించాలనే భావన వద్దు.
  • వారికి ఉపయోగపడే అవకాశాలను వెతకాలి.
  • ఒక సేవకుడిలా, భగవంతుని సేవకునిలా ఉండాలి.
  • మన జీవితాన్ని భగవంతుని చేతిలోని ఒక ఉపకరణంగా భావించాలి.

6. కలవరం తొలగించేది ఉపేక్ష మాత్రమే

  • సమితులలో ప్రారంభ స్నేహపూర్వకత తగ్గి అభిప్రాయ భేదాలు, అపార్థాలు పెరిగాయి.
  • విషయాసక్తి పెరిగితే ఆత్మ భావన దూరమవుతుంది.
  • కీర్తి, సుఖాల కోసం కాకుండా ఉపేక్షను అలవర్చుకోవాలి.
  • ఉపేక్ష ద్వారా మాత్రమే మనశ్శాంతి, పరమ సత్యం గ్రహించగలుగుతాము.

7. నిధుల సమీకరణపై స్వామి సూచనలు

  • నిధుల కోసం తిరగడం, దానాలు సేకరించడం స్వామివారికి నచ్చలేదు.
  • ధనం రజోగుణ సంబంధమైన ప్రమాదకర అంశం అని పేర్కొన్నారు.
  • నిజాయితీ, విశ్వాసంతో ప్రార్థిస్తే అవసరమైన నిధులు స్వయంగా వస్తాయి.
  • సభ్యులు స్వచ్ఛందంగా సహాయం చేయాలనే భావన ఉండాలి.

8. ఖరీదైన వస్తువులు – నిరుపయోగమైన ఆటంకాలు

  • భజన, నగర సంకీర్తనలకు హృదయంలో భక్తి, నాలుకపై నామస్మరణ చాలు.
  • ఖరీదైన వస్తువులు, అధిక ఆర్భాటాలు అవసరం లేదు.
  • ఉపన్యాసాలు, స్వాగతాలు, పురస్కారాలపై అనవసర ఖర్చులు చేయకూడదు.
  • సంస్థలు సరళత, మితవ్యయం విషయంలో ఆదర్శంగా నిలవాలి.

9. ధనానికి తక్కువ ప్రాముఖ్యత

  • సమితి కార్యక్రమాలలో ధనానికి అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ధనవంతుడని భావించి సభ్యత్వం ఇవ్వకూడదు.
  • గుణాలు ధనంకన్నా మిన్న.
  • ప్రేమ, వినయం, నిర్లిప్తత, సేవలను నిజమైన నిధులుగా భావించాలి.

10. నాయకత్వం – రెండు కళ్ల వలె

  • జిల్లా అధ్యక్షుడు, సమితి అధ్యక్షుడు రెండు కళ్లవలె జాగ్రత్తగా వ్యవహరించాలి.
  • సమస్యలను ముందుగానే గుర్తించి సభ్యులను రక్షించాలి.

11. ప్రశాంతి నిలయం – సంస్థ హృదయం

  • ప్రపంచ సమావేశాలు మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగితే సరిపోతుంది.
  • అఖిల భారత సమావేశం ప్రశాంతి నిలయంలో జరగడం సంస్థ హృదయంగా భావించబడింది.

Quiz Questions & Answers

సంస్థ యొక్క హృదయం (ప్రశాంతి నిలయం)

(స్వామి వారి దివ్యోపన్యాసం – నవంబర్ 21, 1968)

1. సత్యసాయి సంస్థల కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

జవాబు: మనస్సును శుద్ధి చేయడం.

2. ధ్యానం, భజనలు, ప్రవచనాలు, సేవా కార్యక్రమాల లక్ష్యం ఏమిటి?

జవాబు: అహంకారం, దురాశ, ద్వేషం, అసూయ వంటి దోషాలను తొలగించడం.

3. సాయి భక్తుని అసలు గుర్తింపు ఏమిటి?

జవాబు: పరస్పరం ప్రేమను పంచడం మరియు సేవ చేయడం.

4. సేవ ఎవరికి చేయాలని స్వామి చెప్పారు?

జవాబు: సేవలు పొందలేని నిరుపేదలకు, అభాగ్యులకు చేయాలి.

5. సేవను ఎలా భావించి చేయాలి?

జవాబు: పూజా భావంతో, భగవంతునికి చేసే సేవగా చేయాలి.

6. చీమను రక్షించిన పావురం కథ ద్వారా స్వామి ఏమి బోధించారు?

జవాబు: ప్రతి జీవిలో దైవత్వం ఉందని, ప్రేమ మరియు దయతో సేవ చేయాలని.

7. భగవంతుడు సేవలో దేనిని చూస్తాడు?

జవాబు: ప్రేమ, దయ, కరుణను చూస్తాడు.

8. జిల్లా అధ్యక్షుడు, సమితి నిర్వాహకుడు తప్పనిసరిగా ఏం చేయాలి?

జవాబు: సాధన చేయాలి మరియు భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి.

9. నాయకుడు ఎలా ఉండాలి?

జవాబు: సేవకుడిలా, భగవంతుని సేవకునిలా ఉండాలి.

10. కలవరం నుండి మనిషిని రక్షించేది ఏమిటి?

జవాబు: ఉపేక్ష (నిర్లిప్తత).

11. ఉపేక్ష వలన ఏమి లభిస్తుంది?

జవాబు: మనశ్శాంతి మరియు పరమసత్య జ్ఞానం.

12. నిధుల కోసం తిరగడం గురించి స్వామి ఏమన్నారు?

జవాబు: నిధుల కోసం తిరగడం నచ్చదని, విశ్వాసంతో ప్రార్థిస్తే అవసరమైన నిధులు వస్తాయని చెప్పారు.

13. ధనం గురించి స్వామి ఏమన్నారు?

జవాబు: ధనం రజోగుణ సంబంధమైనది; దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు.

14. భజనలకు అవసరమైన ప్రధాన అంశం ఏమిటి?

జవాబు: హృదయంలో భక్తి, నాలుకపై నామస్మరణ.

15. ఖరీదైన వస్తువుల గురించి స్వామి అభిప్రాయం ఏమిటి?

జవాబు: అవి నిరుపయోగమైన ఆటంకాలు.

16. సంస్థలు దేనిలో ఆదర్శంగా నిలవాలి?

జవాబు: సరళత, మితవ్యయం, వృథా ఖర్చులను నివారించడం.

17. గుణాలు ముఖ్యమా? ధనం ముఖ్యమా?

జవాబు: గుణాలు ధనంకన్నా మిన్న.

18. నిజమైన నిధులు ఏమిటి?

జవాబు: ప్రేమ, వినయం, నిర్లిప్తత, సేవ.

19. జిల్లా అధ్యక్షుడు, సమితి అధ్యక్షుడు ఎలా ఉండాలి?

జవాబు: రెండు కళ్ల వలె జాగ్రత్తగా వ్యవహరించాలి.

20. సంస్థ యొక్క హృదయం ఏది అని స్వామి చెప్పారు?

జవాబు: ప్రశాంతి నిలయం.


Multiple Choice Questions (MCQ)

1. సత్యసాయి సంస్థల కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

a) ధనం సంపాదించడం
b) మనస్సు శుద్ధి చేయడం
c) పేరు ప్రతిష్ట పొందడం
జవాబు: b) మనస్సు శుద్ధి చేయడం

2. సేవ ఎవరికి చేయాలి?

a) ధనవంతులకు
b) స్నేహితులకు
c) నిరుపేదలకు, అభాగ్యులకు
జవాబు: c) నిరుపేదలకు, అభాగ్యులకు

3. భజనలకు ముఖ్యమైనది ఏమిటి?

a) ఖరీదైన పరికరాలు
b) భక్తి మరియు నామస్మరణ
c) పెద్ద హాల్
జవాబు: b) భక్తి మరియు నామస్మరణ

4. కలవరాన్ని తొలగించేది ఏమిటి?

a) కోపం
b) ఉపేక్ష
c) పోటీ
జవాబు: b) ఉపేక్ష

5. సంస్థ యొక్క హృదయం ఏది?

a) హైదరాబాద్
b) ప్రశాంతి నిలయం
c) సమితి కార్యాలయం
జవాబు: b) ప్రశాంతి నిలయం



*****

NAGARA SANKEERTHANA - 24-6-20206